మత్తులో ఎయిర్ ఇండియా పైలట్.. 300 అడుగులు కిందకు పడిపోయిన విమానం!
ఎయిర్ ఇండియా విమానం గాల్లో అకస్మాత్తుగా కిందకు పడిపోయిన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదానికి కారణమైన పైలట్ నిద్రలేమితో బాధపడుతూ మందులు వాడుతున్నట్లు తేలింది. గతంలో రెండుసార్లు డ్రగ్ టెస్టుల్లో కూడా అతను విఫలమైనట్లు అంతర్గత నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు విమానయాన వర్గాలతో పాటు ప్రయాణికుల్లోనూ తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
ఆగస్టు 4వ తేదీన థాయిలాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం (ఏఐ-2379) మార్గమధ్యలో అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల మేర కిందకు పడిపోయింది. ఆ సమయంలో విమానంలో 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ఈ తీవ్రమైన కుదుపుల కారణంగా కనీసం 20 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది గాయపడ్డారు. తీవ్రమైన ఒత్తిడి మధ్య పైలట్లు విమానాన్ని సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు జరుపుతోంది.
ఈ దర్యాప్తులో భాగంగా వెలువడిన అంతర్గత ఫ్లైట్ సేఫ్టీ నివేదిక ప్రకారం, ప్రధాన పైలట్ వ్యక్తిగత కారణాలతో నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నాడు. దీనికోసం తన ఫ్యామిలీ డాక్టర్ సూచించిన మందులు వాడుతున్నట్లు అతడు స్వయంగా అంగీకరించాడు. అంతేకాకుండా ఈ పైలట్ గతంలో రెండు పర్యాయాలు డ్రగ్ పరీక్షల్లో ఫెయిల్ అయినట్లు కూడా నివేదికలో వెల్లడైంది. లేఓవర్ (విశ్రాంతి) సమయంలో నిద్ర పట్టకపోవడంతో నడక వంటి తేలికపాటి పనులు చేసినట్లు అతడు తన ఫ్లైట్ సేఫ్టీ స్టేట్మెంట్లో పేర్కొన్నాడు.
పని వేళల (రోస్టర్ డ్యూటీస్) కారణంగానే తనకు తగినంత విశ్రాంతి దొరకలేదని పైలట్ వివరణ ఇచ్చాడు. రాత్రి 12:10 గంటలకు విధులకు హాజరు కావాల్సి ఉండగా, రాత్రి 10 గంటల కంటే ముందే సన్నాహాలు ప్రారంభించాల్సి వచ్చిందని, దీంతో ప్రశాంతంగా నిద్రపోయే సమయం లేకుండా పోయిందని తెలిపాడు. ఫుకెట్‌లో ల్యాండ్ అయిన తర్వాత పోస్ట్-ఫ్లైట్ పనులు ముగించుకుని హోటల్‌కు చేరుకోవడానికి మరో రెండు గంటల సమయం పట్టిందని, మళ్లీ భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేవాల్సి రావడం వల్ల తనకు విశ్రాంతి కరువైందని వివరించాడు.
ఈ ఊహించని ప్రమాదం ప్రయాణికుల భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ముఖ్యంగా పైలట్ల మానసిక, శారీరక ఆరోగ్యం, వారికి కేటాయించే పని గంటలపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ ముగిసే వరకు సదరు విమానంలో విధులు నిర్వహించిన ఇద్దరు పైలట్లను యాజమాన్యం రోస్టర్ నుంచి (డ్యూటీ నుంచి) తప్పించింది. విచారణలో తేలే వాస్తవాల ఆధారంగా వారిపై తదుపరి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.


