ఇథనాల్‌తో ఇంజిన్లు పాడవుతాయా? దుష్ప్రచారానికి ప్రయోగంతో చెక్ పెట్టిన ఎంపీ కొండా కొండా విశ్వేశ్వర్ రెడ్డి
దేశంలో పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం (E20) వల్ల వాహనాల ఇంజిన్లు పాడవుతున్నాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, బీజేపీ ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు ఒక వినూత్నమైన ప్రయోగాన్ని చేసి చూపించారు. స్వతహాగా ఇంజనీర్ మరియు విప్రో (Wipro HCIT), జనరల్ ఎలక్ట్రిక్ (GE MSIT) వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు సీఈఓగా పనిచేసిన సుదీర్ఘ సాంకేతిక అనుభవం ఉన్న ఆయన, సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. రెండు వేర్వేరు స్టీల్ గిన్నెలను తీసుకుని, ఒకదాంట్లో సాధారణ పెట్రోల్, మరొక దాంట్లో ల్యాబ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఇథనాల్ పోసి అంటించి, ఈ రెండు ఇంధనాలు ఏ విధంగా మండుతాయో కళ్లకు కట్టినట్లు ప్రత్యక్షంగా చూపించారు. ఈ ప్రయోగం ద్వారా కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా ఒక సైంటిఫిక్ నిపుణుడిగా ఆయన ఇథనాల్ ఆవశ్యకతను వివరించారు.

ఈ ప్రయోగంలో పెట్రోల్ మరియు ఇథనాల్ మండిన తీరులో ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని ఎంపీ గారు నిరూపించారు. పెట్రోల్ మండుతున్నప్పుడు తీవ్రమైన నల్లటి పొగ వెలువడటమే కాకుండా, మంట ఆరిన తర్వాత గిన్నెలో నల్లటి మసి (బూడిద) మిగిలిపోవడాన్ని చూపించి, ఇది పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించే కలుషిత ఇంధనం అని స్పష్టం చేశారు. దీనికి భిన్నంగా ఇథనాల్ అంటుకున్నప్పుడు ఎటువంటి పొగ లేకుండా అత్యంత స్వచ్ఛమైన నీలం రంగు మంటతో (Blue Flame) వేగంగా కాలింది. ఇథనాల్ పూర్తిగా మండిన తర్వాత గిన్నెలో ఎలాంటి మసీ లేదా అవశేషాలు మిగలకపోవడాన్ని చూపిస్తూ, ఇది నూరు శాతం స్వచ్ఛమైన ‘క్లీన్ బర్నింగ్ ఫ్యూయల్’ అని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. పెట్రోల్ వాడకం వల్ల మన ఆరోగ్యానికి, పర్యావరణానికి జరిగే కాలుష్య నష్టాన్ని ఈ ప్రయోగం కళ్లకు కట్టింది.
ఇథనాల్ వాడకం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా రైతులకు కలిగే అపారమైన ప్రయోజనాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. పెట్రోల్ తయారీకి కావాల్సిన క్రూడాయిల్‌ను మనం అమెరికా, సౌదీ అరేబియా, ఇరాన్ వంటి దేశాల నుంచి భారీగా డబ్బు వెచ్చించి దిగుమతి చేసుకుంటున్నామని, దీనివల్ల విదేశాలకు మాత్రమే లాభం జరుగుతుందని తెలిపారు. కానీ, ఇథనాల్ అనేది మన దేశంలో పండే చెరుకు (మొలాసిస్), మొక్కజొన్న, పాడైపోయిన వరి వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి స్థానిక ఫ్యాక్టరీల్లో తయారవుతుంది. ఒక్క తెలంగాణలోనే ఏడు ఇథనాల్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహించడం వల్ల ఆ డబ్బు నేరుగా మన దేశ రైతుల జేబుల్లోకి వెళ్తుందని, తద్వారా విదేశాలపై ఆధారపడటం తగ్గుతుందని ఎంపీ గారు స్పష్టం చేశారు. అంతేకాకుండా పెట్రోల్ అనేది భూగర్భం నుంచి తీసే ఫాసిల్ ఫ్యూయల్ కావడం వల్ల వాతావరణంలోకి కొత్తగా కార్బన్ డై ఆక్సైడ్ చేరుతుందని, అదే ఇథనాల్ వాడకం వల్ల కార్బన్ సైకిల్ బ్యాలెన్స్ అయ్యి పర్యావరణం రక్షించబడుతుందని తెలిపారు.
ఇక ఇథనాల్ వల్ల ఇంజిన్లు పాడవుతాయన్న అపోహలపై తన సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన పూర్తి స్పష్టత ఇచ్చారు. అమెరికాలోని న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NJIT), ఎసెక్స్ కౌంటీ కాలేజీలలో అధ్యాపకుడిగా పనిచేసి, పలు ఐపీఆర్‌లు (IPRs) సృష్టించిన సిటాడెల్ రీసెర్చ్ సంస్థ స్థాపకుడిగా ఆయన మాట్లాడుతూ.. ఇథనాల్‌కు ఆక్టేన్ వాల్యూ (Octane value) మరియు కంప్రెషన్ రేషియో పెట్రోల్ కంటే ఎక్కువగా ఉంటాయని తెలిపారు. బ్రెజిల్, అర్జెంటీనా లాంటి దేశాల్లో కార్లలో ఏకంగా 80 నుంచి 100 శాతం ఇథనాల్ వాడుతున్నారని ఉదహరించారు. కొత్త బండ్లలో E20 ఇంధనం వాడటం వల్ల మైలేజ్ కేవలం 3 శాతం మాత్రమే తగ్గుతుందని, కానీ పెట్రోల్ తో పోలిస్తే ఇథనాల్ ధర చాలా తక్కువ కాబట్టి వినియోగదారుడికి ఆర్థికంగా కూడా లాభమే చేకూరుతుందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు కుండబద్దలు కొట్టారు.


