ఆర్యభట్టకు ముందే లెక్కలు లేవా?” పనికిమాలిన లాజిక్‌తో హిందూ పురాణాలను టార్గెట్ చేసి అడ్డంగా బుక్కయిన మహిళ!
షల్ మీడియా వేదికగా ఒక మహిళ అడిగిన ప్రశ్న విపరీతంగా వైరల్ అవుతోంది. “సున్నాను (0) ఐదవ శతాబ్దంలో ఆర్యభట్ట కనిపెడితే, అంతకుముందే జరిగిన రామాయణంలో రావణాసురుడికి 10 తలలు ఉన్నాయని, మహాభారతంలో కౌరవులు 100 మంది అని ఎలా లెక్కపెట్టారు?” అని ఆమె ప్రశ్నించింది. నిర్మొహమాటంగా చెప్పాలంటే, ఈ ప్రశ్న వెనుక ఉన్నది కేవలం సగం జ్ఞానం మాత్రమే. చరిత్ర, గణితం మరియు భాషలపై కనీస అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి తర్క రహితమైన ప్రశ్నలు పుట్టుకొస్తాయి. భాషకు, గణిత సూత్రాలకు ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించకుండా, సోషల్ మీడియాలో కేవలం వీక్షణలు (వ్యూస్), వివాదాలు పెంచుకోవడం కోసం అజ్ఞానంతో అడిగిన ప్రశ్న ఇది తప్ప, ఇందులో ఎలాంటి చారిత్రక లేదా శాస్త్రీయ ప్రామాణికత లేదు..
మొదటగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే—అక్షరాలకు (పదాలకు) మరియు అంకెలకూ చాలా తేడా ఉంది. రామాయణ, మహాభారతాలు సంస్కృత శ్లోకాల రూపంలో రాయబడ్డాయి. అందులో పదిని ‘దశ’ అని (ఉదాహరణకు దశకంఠుడు), వందను ‘శతం’ అని (శతకౌరవులు) పదాల రూపంలో రాశారు తప్ప, 10 లేదా 100 అని ఆధునిక అంకెల రూపంలో రాయలేదు. కాగితం మీద 1, 2, 3 అని అంకెలు రాసే విధానం రాకముందు కూడా మనుషులకు వస్తువులను లెక్కపెట్టడం తెలుసుదనడానికి రోమన్ సంఖ్యామానమే నిదర్శనం. రోమన్ సంఖ్యల్లో అసలు సున్నా (0) అనేదే ఉండదు; అయినా వారు పదిని ‘X’ అని, ఏభైని ‘L’ అని, వందను ‘C’ అని రాశారు. ఇక ఐదవ శతాబ్దంలో ఆర్యభట్ట సున్నా అనే భావనను కొత్తగా కనిపెట్టలేదు. అంతకుముందే భారతీయులకు ‘శూన్యం’ తెలుసు. క్రీస్తు పూర్వం నాటి పింగళుడి ‘ఛందస్సూత్రం’లోనూ, వేదాలలోనూ శూన్యం పదం స్పష్టంగా ఉంది. ఆర్యభట్ట చేసినదల్లా గణితంలో పెద్ద లెక్కలు వేయడానికి వీలుగా స్థాన విలువ (Place Value System) విధానాన్ని, సున్నాను ఒక సంఖ్యగా వాడే పద్ధతిని క్రమబద్ధీకరించడం మాత్రమే. ఆ తర్వాత బ్రహ్మగుప్తుడు లాంటి వారు సున్నాకి ఒక ఆకారాన్ని, నిర్దిష్టమైన గణిత నియమాలను ఏర్పరిచారు.
ఆర్యభట్ట కాలానికి వేల సంవత్సరాల ముందే భారతీయులకు సంఖ్యామానంపై ఉన్న అవగాహనకు యజుర్వేదంలోని మేధాతిథి మహర్షి మంత్రమే సజీవ సాక్ష్యం. యజ్ఞం చేసే సమయంలో ఇటుకలు పేరుస్తూ “ఈ ఇటుకలు నాకు పాలిచ్చే ఆవులుగా మారాలి” అని అగ్ని దేవుడిని ప్రార్థించే క్రమంలో ఆయన చదివిన మంత్రం (“ఇమం మే అగ్న ఇష్టకా ధేనవః సన్తు ఏకా చ దశ చ…”). నేటికీ శ్రీ వైఖానస (వైష్ణవ) సాంప్రదాయంలో అగ్ని ప్రతిష్ఠకు అర్చకులు ఈ మంత్రాన్ని చదువుతున్నారు. ఆ మంత్రంలో పేర్కొన్న సంఖ్యా మానం ప్రకారం:
- ఏక – 1
- దశ – 10 (10 to the power of (1)
- శత – 100(10 to the power of 2)10×10
- సహస్ర – 1000 (10 to the power of 3) 10×10×10
- ఆయుతం – 10,000 (10 to the power of 4) 10×10×10×10
- నియుతం – 1,00000(10 to the power of 5) 10×10×10×10×10
- ప్రయుతం – 10,00000(10 to the power of 6) 10×10× 10×10× 10× 10
- అర్బుధం – 10,000,000(10 to the power of 7) 10×10×10×10×10× 10 ×10
- న్యార్బుదం – 100,000,000 (10 to the power of 8) 10×10×10× 10× 10×10×10×10
- సముద్రం – 1,000,000,000( 10 to the power of 9) 10×10×10× 10× 10×10×10×10×10
- మద్యం – 1,000,0000,000( 10 to the power of 10) 10×10×10× 10×10×10×10×10×10×10
- అంతం – 100,000,000,000(10 to the power of11) 10×10×10× 10 ×10×10×10×10×10×10×10
- పరార్ధం – 1,000,000,000,000(10 to the power of 12) 10×10×10×10× 10× 10×10×10×10×10×10×10.
ఈ రకంగా ఒక్కొక్క స్థాన విలువను పది రెట్లు పెంచుకుంటూ లక్షల కోట్లు, వేల కోట్ల స్థాయి సంఖ్యలను యజుర్వేదంలోనే వర్ణించడం భారతీయ వేద గణిత శాస్త్ర ప్రాచీనతకు, గొప్పతనానికి బలమైన ఆధారం.
(హర శ్రీనివాస్ జాస్తి , లక్ష్మన్న సౌజన్యంతో)


