సరిహద్దుల్లో టెన్షన్! టెన్షన్! భారత బేస్‌లకు చేరువలో చైనా జే-20 స్టెల్త్ ఫైటర్స్!
భారత సరిహద్దుల (LAC) వద్ద చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగుతోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచేలా కీలక ప్రాంతాల్లో తన అత్యాధునిక ఆయుధ సంపత్తిని మోహరిస్తోంది. తాజాగా వాస్తవాధీన రేఖకు అత్యంత సమీపంలో చైనా తన అత్యంత శక్తివంతమైన 5వ తరం జే-20 (J-20) స్టెల్త్ ఫైటర్ జెట్స్‌ను సిద్ధంగా ఉంచినట్లు కమర్షియల్ ఉపగ్రహ చిత్రాల ద్వారా వెలుగులోకి వచ్చింది.
జింజియాంగ్, డామ్‌జంగ్ (టిబెట్) వైమానిక స్థావరాల్లో చైనా ఈ స్టెల్త్ విమానాలను మోహరించింది. జింజియాంగ్ లోని హుటాన్ ఎయిర్‌బేస్‌లో 8 జే-20 విమానాలను ఉంచగా, ఇది లద్దాఖ్‌లోని భారత వైమానిక స్థావరం ‘దౌలత్ బేగ్ ఓల్డీ’కి కేవలం 254 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అలాగే, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతానికి 344 కిలోమీటర్ల దూరంలో ఉన్న టిబెట్ లోని డామ్‌జంగ్ ఎయిర్‌బేస్‌లో మరో 4 విమానాలు ఉన్నట్లు జూన్, జూలై నెలల్లో తీసిన చిత్రాల్లో వెల్లడైంది.

చైనా ఎయిర్‌ఫోర్స్‌లో అత్యంత కీలకమైన ఈ జే-20 విమానాలు 5వ తరానికి చెందిన స్టెల్త్ ఫైటర్ జెట్స్. వీటి ప్రధాన బలం ఏమిటంటే, శత్రు దేశాల రాడార్ల కంటికి ఇవి అంత సులభంగా చిక్కవు. ఒకవేళ యుద్ధ వాతావరణమే వస్తే, శత్రు స్థావరాలపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా దాడి చేయగల అత్యుత్తమ సామర్థ్యం వీటికి ఉంది.
గతంలో ఈ రెండు బేస్‌లలో జే-20 విమానాల సంఖ్య చాలా తక్కువగా ఉండేది, కానీ ఇటీవల చైనా వీటి సంఖ్యను భారీగా పెంచుతూ వస్తోంది. టిబెట్, జింజియాంగ్ ప్రావిన్స్‌లలో మిలిటరీ మౌలిక వసతులను ఆధునికీకరిస్తున్న చైనా, అందులో భాగంగానే ఈ స్టెల్త్ జెట్స్‌ను ఇక్కడకు తరలించింది. ప్రస్తుత తరుణంలో భారత్ వద్ద అవసరాలకు సరిపడా ఫైటర్ జెట్స్ అందుబాటులో లేవని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో, చైనా వ్యూహాత్మకంగా జెట్స్‌ను సరిహద్దులకు సమీపంలో మోహరించడం పట్ల భారత సైన్యం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది.


