సిరిసిల్లలో బద్దలవుతున్న కేటీఆర్ కంచుకోట..? పగబట్టిన రేవంత్, ఎటాక్ మోడ్లో బండి.. 2028లో సంచలనం తప్పదా?

సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం అనగానే రాష్ట్ర రాజకీయాల్లో వెంటనే గుర్తొచ్చే పేరు కల్వకుంట్ల తారక రామారావు. వరుసగా ఐదుసార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, సిరిసిల్లను తన కంచుకోటగా మార్చుకున్నారు కేటీఆర్. అయితే, దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం కావడంతో స్థానిక రాజకీయ ముఖచిత్రం అనూహ్యంగా మారుతోంది. ఇన్నాళ్లూ ఒకే నాయకుడు ఉండటం, ఇప్పుడు పార్టీ అధికారంలో లేకపోవడంతో నియోజకవర్గంలో అభివృద్ధి మందగించిందనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మార్పు కోసం జనాలు ఎదురుచూస్తున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కేటీఆర్ చుట్టూ ఇప్పుడు ఎన్నడూ లేనంతగా రాజకీయ ఉచ్చు బిగుస్తోందని, రాబోయే 2028 ఎన్నికల్లో ఆ కంచుకోట బద్దలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా ఈ సారి ఎన్నికల్లో కేటీఆర్ కు ఎదురుకాబోతున్న అతిపెద్ద సవాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2019 ఎన్నికల సమయంలో కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడించడానికి అప్పటి అధికార పార్టీగా బీఆర్ఎస్ పన్నిన వ్యూహాలు, ప్రయోగించిన అస్త్రాలు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆనాటి అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు రేవంత్ రెడ్డి సిరిసిల్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఎలాగైనా సరే కేటీఆర్ ను ఆయన సొంత గడ్డపైనే ఓడించి తీరాలనే కసితో కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోంది. దీనికోసం సిరిసిల్లలో క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ, సరైన సమయం చూసి ఒక బలమైన నాయకుడిని కేటీఆర్ పై బరిలోకి దింపేందుకు పక్కా మాస్టర్ ప్లాన్ రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

దీనికి తోడు స్థానిక ఎంపీ, భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ తో నడుస్తున్న ఆధిపత్య పోరు కేటీఆర్ కు మరో పెద్ద తలనొప్పిగా మారింది. బండి సంజయ్ ను రాజకీయంగా, సైద్ధాంతికంగా ఎదుర్కోలేక.. ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పదే పదే విమర్శలు చేయడం, సోషల్ మీడియా వేదికగా వారిపై ఫేక్ నెరేటివ్స్ రన్ చేయడం లాంటివి కేటీఆర్ కు ప్రతికూలంగా మారుతున్నాయని లోకల్ టాక్. రాజకీయ పోరాటాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం పట్ల సామాన్య ప్రజల్లోనూ తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలు క్షేత్రస్థాయిలో ప్రజల సానుభూతిని బండి సంజయ్ వైపు మళ్లేలా చేస్తూ, కేటీఆర్ పై మరింత వ్యతిరేకతను పెంచుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ పరిణామం బీఆర్ఎస్ కు తీవ్ర నష్టాన్ని చేకూర్చే ప్రమాదం ఉంది.
ఇక కేటీఆర్ వ్యవహార శైలి కూడా ఆయన పునాదులకే ఎసరు తెస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ, పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపే పనిలో బిజీగా ఉన్న కేటీఆర్.. అదే సమయంలో తన సొంత నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారన్న అపవాదు మూటగట్టుకుంటున్నారు. వరుసగా ఇన్ని విజయాలు అందించిన నాయకుడు ఇప్పుడు స్థానిక సమస్యల పరిష్కారానికి, ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం జనాల్లో అసంతృప్తిని రగిలిస్తోంది. రాష్ట్రమంతా తిరుగుతూ సొంత ఇలాకాను పట్టించుకోకపోతే అసలుకే మోసం వస్తుందని గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ హెచ్చరిస్తున్నాయి.

ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో గతంలో జరిగిన ‘నేరెళ్ల’ ఘటన తాలూకు చేదు జ్ఞాపకాలు ఎన్నికల నాటికి మళ్లీ తెరపైకి వచ్చి ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కేటీఆర్ కు స్థానికంగా ఎంత అనుచరగణం ఉన్నప్పటికీ, యాంటీ ఇన్కంబెన్సీ అనేది చాపకింద నీరులా విస్తరిస్తోంది. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ మళ్లీ బరిలోకి దిగితే పరిస్థితులు మరింత ఆసక్తికరంగా మారతాయి. అటు కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థి, ఇటు బీజేపీ నుంచి రాణి రుద్రమ బరిలో ఉంటే సిరిసిల్లలో ముక్కోణపు పోరు తథ్యం. ఒకవైపు రేవంత్ రెడ్డి రివెంజ్ ప్లాన్, మరోవైపు బండి సంజయ్ కౌంటర్ ఎటాక్, వీటికి తోడు స్థానికంగా పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత.. ఇవన్నీ ఇలాగే కొనసాగితే 2028లో కేటీఆర్ వరుస విజయాలకు బ్రేక్ పడి ఆయన ఓటమి చవిచూడటం ఖాయమని విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అయితే, నాయకులు ఎన్ని ఎత్తుగడలు వేసినా, అంతిమంగా ఓటరు నాడి ఎలా ఉందో, వారి హృదయాల్లో ఏముందో ఎన్నికల ఫలితాలే స్పష్టం చేయనున్నాయి.


