మేఘాలయ ‘హనీమూన్ మర్డర్ కేసు’ — పోలీసుల నిర్లక్ష్యం హంతకురాలికి వరంలా ఎలా మారింది?
జర్నలిస్ట్ శిరీష (ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్)
భర్తను పకడ్బందీగా హత్య చేయించిన కేసులో కటకటాల వెనక్కి వెళ్లిన ప్రధాన నిందితురాలు.. కేవలం పది నెలలకే దర్జాగా జైలు నుంచి బయటకు వచ్చింది. కోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించలేదు.. కానీ దర్యాప్తు సంస్థల ఘోరమైన నిర్లక్ష్యం, చట్టపరమైన లొసుగులే ఆమెకు స్వేచ్ఛను ప్రసాదించాయి. సంచలనం సృష్టించిన మేఘాలయ ‘హనీమూన్ మర్డర్ కేసు’లో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీ బెయిల్‌ను మేఘాలయ హైకోర్టు జూన్ 29న (సోమవారం) సమర్థించింది.
అసలు సుపారీ ఇచ్చి హత్య చేయించిన ఒక నిందితురాలికి చట్టం ఎలా లొంగిపోయింది? ఈ కేసులో దర్యాప్తు అధికారుల వైఫల్యం ఎక్కడ బయటపడింది?
అసలు నేరం: హనీమూన్‌లోనే భర్త హత్య
మే 2025లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహం తర్వాత హనీమూన్ కోసం మేఘాలయలోని చిరపుంజి (Cherrapunji) వెళ్లిన సమయంలో భర్త రాజా రఘువంశీని సోనమ్ హత్య చేయించింది. తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి కుట్ర పన్ని, ముగ్గురు సుపారీ కిల్లర్స్‌తో ఈ హత్యను అమలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్ దాదాపు 10 నెలలుగా జైలులో ఉంది.
పోలీసుల తప్పిదాలు: విచారణలో బయటపడిన దర్యాప్తు డొల్లతనం
సోనమ్ కు ఏప్రిల్ లో షిల్లాంగ్ సెషన్స్ కోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన అప్పీల్ ను.. జస్టిస్ డబ్ల్యూ. డీంగ్డో నేతృత్వంలోని మేఘాలయ హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. సుమారు 10 రోజుల పాటు ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. దర్యాప్తు సంస్థల విధానపరమైన తప్పులను ఎత్తిచూపుతూ బెయిల్ ను సమర్థించింది.
అదనపు డిప్యూటీ కమిషనర్ (జుడీషియల్) దషలీన్ ఆర్. ఖర్బటెంగ్ పరిశీలనలో పోలీసుల విచారణలో ప్రధానంగా మూడు లొసుగులు బయటపడ్డాయి:
- తప్పుల తడకగా అరెస్టు పత్రాలు: సోనమ్ పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) కింద హత్య కేసు నమోదు చేయాల్సి ఉంది. కానీ.. అరెస్ట్ మెమో, ఇన్స్పెక్షన్ మెమో, కేస్ డైరీ, జస్టిఫికేషన్ చెక్‌లిస్ట్ వంటి కీలక పత్రాలన్నింటిలోనూ తప్పుగా సెక్షన్ 403(1)/238(a)/309(6)/3(6) BNS అని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక టైపింగ్ పొరపాటు కాదని, ప్రతి డాక్యుమెంట్ లోనూ ఇదే తప్పు పునరావృతం కావడం పోలీసుల పనితీరులోని తీవ్ర నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని కోర్టు వ్యాఖ్యానించింది.
- రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం అరెస్టుకు గల కారణాలను నిందితులకు స్పష్టంగా తెలియజేయాలి. కానీ, సోనమ్ ను అసలు హత్య కేసు (సెక్షన్ 103(1)) కింద అరెస్టు చేస్తున్నట్లు ఏ ఒక్క పత్రంలోనూ ఆమెకు అధికారికంగా తెలియజేయలేదు. నిందితురాలికి తనపై మోపిన నిర్దిష్ట నేరాల గురించి చెప్పకపోవడం ఆమె డిఫెన్స్ కు ఆటంకం కలిగించిందని కోర్టు స్పష్టం చేసింది.
- నత్తనడకన సాక్షి విచారణ: పోలీసులు ఏకంగా 790 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కానీ దర్యాప్తు, సాక్షుల విచారణ మాత్రం నత్తనడకన సాగుతోంది. గుర్తించిన 90 మంది సాక్షుల్లో ఇప్పటివరకు కేవలం 4 గురిని మాత్రమే విచారించారు.
షరతులతో కూడిన బెయిల్
గతంలో మూడుసార్లు బెయిల్ తిరస్కరణకు గురైన సోనమ్, చివరకు తన నాలుగో పిటిషన్లో పోలీసుల చట్టపరమైన లోపాల ఆధారంగానే బయటపడింది. రూ. 50,000 వ్యక్తిగత పూచీకత్తు, అంతే మొత్తానికి ష్యూరిటీ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు విచారణలకు తప్పనిసరిగా హాజరుకావాలని, సాక్ష్యాలను తారుమారు చేయకూడదని, అనుమతి లేకుండా కోర్టు పరిధిని దాటి వెళ్లకూడదని షరతులు విధించింది.
సోనమ్ రఘువంశీకి బెయిల్ రావడం ఆమె నిర్దోషిత్వానికి నిదర్శనం ఏమాత్రం కాదు. నేర పరిశోధనలో చట్టపరమైన ప్రక్రియలను పక్కాగా పాటించకపోతే, కేసు ఎంత బలమైనదైనా ప్రాసిక్యూషన్ వాదన వీగిపోతుందనడానికి ఈ తీర్పు ఒక సజీవ ఉదాహరణ. కిందిస్థాయి దర్యాప్తు అధికారుల ఒక చిన్న నిర్లక్ష్యం.. ఒక హత్య కేసులో ప్రధాన నిందితురాలికి న్యాయపరమైన లొసుగుగా మారి ఆమె జైలు నుంచి బయటకు వచ్చేలా చేసింది.


