కూతురి మాటలకే బర్తరఫ్ చేస్తారా? బీసీ మహిళ నేత కొండా సురేఖపై రేవంత్ కక్ష సాధింపు!
తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై బీసీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేవలం ఆమె కూతురు మాట్లాడిన మాటలను సాకుగా చూపి, రాష్ట్రంలో బలమైన బీసీ మహిళా నేతగా ఉన్న సురేఖపై ఇంత కఠినంగా వేటు వేయడం ఏంటనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఒక బీసీ మహిళను సాకుగా చూపి అవమానకరంగా మంత్రివర్గం నుంచి తప్పించడం పట్ల బడుగు బలహీన వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
అయితే, కొండా సురేఖపై వేటు వేసిన వెంటనే ఆ వివాదాన్ని, వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం హడావుడిగా కొన్ని నామినేటెడ్ పోస్టులను ప్రకటించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా ఉన్న డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని ఆకస్మాత్తుగా రద్దు చేసి, ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా సీనియర్ నేత నెరెళ్ల శారదను నియమిస్తూ ప్రభుత్వం ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు వరంగల్ నగరానికి సంబంధించి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒకవైపు ముగ్గురు మహిళలకు కీలక పదవులు ఇచ్చామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న సర్కార్.. అదే సమయంలో ఏళ్ల తరబడి కష్టపడిన ఒక బలమైన బీసీ మహిళను మాత్రం అకారణంగా బర్తరఫ్ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని నేటి తెలుగు మీడియా వర్గాలు సైతం ప్రశ్నిస్తున్నాయి. ఒక బీసీ మహిళ పట్ల వ్యవహరించిన ఈ తీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాజకీయంగా కొత్త సవాళ్లను విసిరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


