ఆపరేషన్ సిందూర్ హీరో ఇప్పుడు రామ మందిర సీఈఓ.. ఇంతకీ జితేంద్ర మిశ్రా ఎవరు?
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తొలి పూర్తిస్థాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రామ మందిరానికి సంబంధించిన నిధుల నిర్వహణలో కొన్ని అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, పరిపాలనా విభాగాన్ని మరింత పారదర్శకంగా, బలోపేతం చేసేందుకు ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వచ్చిన సుమారు 5,585 దరఖాస్తులను పరిశీలించిన అత్యున్నత స్థాయి కమిటీ, ఫైనల్ చేసిన ముగ్గురు వ్యక్తుల్లో అత్యంత సమర్థుడైన మిశ్రాను ఈ కీలక పదవికి ఎంపిక చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా భోపత్పురాకు చెందిన ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన జితేంద్ర మిశ్రా అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన తండ్రి ఒక లెక్చరర్. పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)లో ప్రాథమిక శిక్షణ పొందిన ఆయన, ఆ తర్వాత బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్స్ స్కూల్, అమెరికాలోని ఎయిర్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీ, యూకేలోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్‌లో ఉన్నత శిక్షణ పూర్తి చేశారు.
1986 డిసెంబర్ 6న ఫైటర్ పైలట్‌గా భారత వాయుసేనలో చేరిన ఆయన, సుమారు నాలుగు దశాబ్దాల పాటు దేశానికి విశేష సేవలందించారు. తన కెరీర్లో 18 రకాల ఫైటర్, రవాణా విమానాలు, హెలికాప్టర్లను సుమారు 3,000 గంటలకు పైగా నడిపిన అపార అనుభవం ఆయన సొంతం. కేవలం కమాండ్ పదవులకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక టెస్ట్ పైలట్‌గా కూడా పనిచేశారు. ముఖ్యంగా కార్గిల్ యుద్ధ సమయంలో టైగర్ హిల్, మున్థో ధాలో లాంటి ప్రాంతాల్లో దాడులు చేసిన మిరాజ్ 2000 విమానాల కోసం లేజర్ గైడెడ్ బాంబులను ఆపరేషన్ చేయడానికి రూపొందించిన బృందంలో మిశ్రా కూడా ఒకరు కావడం విశేషం.
గతేడాది (2025) మే నెలలో భారత వాయుసేన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో జితేంద్ర మిశ్రా వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కు నాయకత్వం వహించారు. ఈ ఆపరేషన్‌లో ఆయన కనబరిచిన అసాధారణ ధైర్యసాహసాలు, పక్కా ప్రణాళిక, వ్యూహాత్మక నైపుణ్యాలకు గాను అత్యున్నత ‘సర్వోత్తమ్ యుధ్ సేవా మెడల్’ (SYSM) దక్కింది. ఇలా 40 ఏళ్ల పాటు ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన, ఈ ఏడాది ఏప్రిల్ 30న ఎయిర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా పదవీ విరమణ చేశారు.
సైన్యంలో నిష్కళంకమైన సేవలందించిన ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా.. ఇప్పుడు అయోధ్య రామయ్య సేవలో తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. రామ మందిర ట్రస్ట్ చరిత్రలో ఇలా ఒక ప్రొఫెషనల్ సీఈఓని నియమించడం ఇదే తొలిసారి. ఇకపై మందిరానికి సంబంధించిన రోజువారీ భద్రత, లాజిస్టిక్స్, నిధుల నిర్వహణతో పాటు ట్రస్ట్ డీడ్ అవసరాలకు అనుగుణంగా సంస్థాగత నిర్మాణాన్ని అభివృద్ధి చేసే బాధ్యతలన్నీ ఆయనే పర్యవేక్షించనున్నారు. కచ్చితమైన క్రమశిక్షణ కలిగిన సైనికాధికారి చేతుల్లోకి పరిపాలన వెళ్లడంతో, రామ మందిర కార్యకలాపాలు ఇకపై మరింత పకడ్బందీగా సాగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు.


