పాస్టర్‌పై ఈడీ సంచలన దాడులు.. మతమార్పిడుల కోసం రూ. 2 కోట్ల విదేశీ నిధులు!
జైపూర్‌కు చెందిన పాస్టర్ రవి మోహన్ పహాడియాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు దాడులు నిర్వహించారు. మత మార్పిడి కార్యకలాపాల కోసం విదేశాల నుంచి అక్రమంగా రూ. 2 కోట్లకు పైగా నిధులను స్వీకరించారనే ఆరోపణలపై ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, 1999 (FEMA) కింద శుక్రవారం ఈ సోదాలు జరిగాయి. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) రిజిస్ట్రేషన్ లేకుండానే ఈ విదేశీ నిధులను ఆయన స్వీకరించినట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
ఈ దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. పాస్టర్ పహాడియా, అతని భార్య గుంజన్ శర్మలు అమెరికాకు చెందిన థామస్ యూజీన్ లించ్ అనే దాత నుంచి ప్రధానంగా ఈ విదేశీ నిధులను భారీగా పొందారు. ఈ డబ్బును వ్యాపారం, మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ, పబ్లిక్ రిలేషన్స్ సేవల కోసం అని తప్పుగా చూపిస్తూ అక్రమంగా భారతదేశానికి తీసుకువచ్చారు. అయితే వాస్తవానికి ఈ నిధులను జైపూర్, దక్షిణ రాజస్థాన్‌లోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ-వాల్మీకి, ఎస్టీ-భిల్లు వర్గాల ప్రజలను ఉద్దేశించి మతమార్పిడి కార్యక్రమాలు నిర్వహించడానికి ఉపయోగించినట్లు ఈడీ గుర్తించింది.
ఈడీ సోదాల్లో అనేక కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాస్టర్ పహాడియా ఎలాంటి FCRA అనుమతి లేకుండా సుమారు రూ. 2.88 కోట్ల విదేశీ నిధులను విరాళాలుగా పొందినట్లు ఈడీ పేర్కొంది. ఈ నిధులను కేవలం మతమార్పిడులకే కాకుండా తన వ్యక్తిగత ఖర్చులకు, విదేశీ ప్రయాణాలకు, తన పేరు మీద ఆస్తులు కొనుగోలు చేయడానికి కూడా వాడుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆయన విదేశీయులతో నిరంతరం టచ్‌లో ఉంటూ, వారి సూచనల మేరకు అట్టడుగు మరియు గిరిజన వర్గాల ప్రజలలో మతమార్పిడి కోసం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి.
విదేశీ నిధుల నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల FCRA నిబంధనలను మరింత కఠినతరం చేసిన నేపథ్యంలో ఈ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం మతపరమైన కార్యక్రమాలకు విదేశీ విరాళాలను వినియోగించేందుకు అనుమతి ఉన్నప్పటికీ, మతమార్పిడి వంటి (Proselytisation) కార్యక్రమాలకు విదేశీ నిధులను ఉపయోగించడాన్ని ప్రభుత్వం స్పష్టంగా నిషేధించింది. సంస్థల్లో విదేశీయులు కీలక పాత్ర పోషించకుండా నిబంధనలు తెచ్చిన తరుణంలో, విదేశీ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టే దిశగా ఈడీ ఈ కఠిన చర్యలు చేపట్టింది.


