దేశ భద్రతపై కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు: మోదీ సర్కార్‌ను బద్నాం చేసేందుకు చైనా కార్డ్!
దేశ భద్రత, జాతీయ ప్రయోజనాల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి ఉందా? అని ఆలోచిస్తే, వారి చరిత్ర అంతా మోసాలు, కుట్రలతో నిండి ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా కేరళలోని కాంగ్రెస్ యూనిట్ నివేదించినట్లు కరోనా సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్థాపించిన PM CARES Fund కు కొన్ని చైనా కంపెనీలు విరాళాలు ఇచ్చాయని, అందుకే చైనా సైన్యం లడఖ్‌లో 4067 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమిస్తున్నా మోదీ ప్రభుత్వం మౌనంగా ఉందని ఓ అసంబద్ధమైన ఆరోపణ చేసింది. ఒక పక్క వామపక్ష భావజాలం ఉన్న వార్తా సంస్థలైన “ది వైర్” లాంటి పోర్టల్స్ రాసిన వార్తలను ఆధారం చేసుకుని, చైనా టెక్ కంపెనీలైన టిక్‌టాక్ (₹30 కోట్లు), హువావే (₹7 కోట్లు), షియోమి (₹10 కోట్లు) పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళాలు ఇచ్చాయంటూ కాంగ్రెస్ గోల చేస్తోంది.
నిజానికి, పీఎం కేర్స్ అనేది ఏ ఒక్కరి సొంత ఆస్తి కాదు. అది కోవిడ్ మహమ్మారి వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన చట్టబద్ధమైన రిజిస్టర్డ్ ఛారిటబుల్ ట్రస్ట్. ఆ సమయంలో భారతీయ కంపెనీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చాయి. కేవలం ఆ విరాళాల వల్లే మోదీ గారు దేశాన్ని చైనాకు అమ్మేశారని ఆరోపించడం కాంగ్రెస్ నాయకుల మేధోసంపత్తికి నిదర్శనం. మోదీ ప్రభుత్వం చైనా కుట్రలను ఎంత సమర్థవంతంగా తిప్పికొడుతోందో వీరికి కనబడదా? విరాళాలు ఇచ్చిన కొద్ది నెలలకే TikTok లాంటి చైనా యాప్‌లను మోదీ ప్రభుత్వం బ్యాన్ చేసి, చైనాకు బుద్ధి చెప్పింది అనే విషయం వీరికి ఎందుకు గుర్తుకు రాదు?

చైనా విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంటుంది. ఎందుకంటే, వాళ్ల చేతులకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CCP) మసి అంటుకుని ఉంది. 2007లో కాంగ్రెస్ పార్టీకి, సీసీపీకి మధ్య జరిగిన రహస్య అవగాహన ఒప్పందం (MoU) సంగతి దేశ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఆ తర్వాత కూడా రాహుల్ గాంధీ చైనా అధికారులతో రహస్యంగా భేటీలు కావడం, ఆ విషయాలను ముందు దాచిపెట్టి, తర్వాత మీడియా ఒత్తిడికి తలొగ్గి ఒప్పుకోవడం అంతా జగమెరిగిన సత్యం. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పుడు, కాంగ్రెస్ తమ సొంత నాయకుడినే ఒక యాంటీ-చైనా పోస్ట్‌ను డిలీట్ చేయాలని ఒత్తిడి చేసిన చరిత్ర వాళ్లది.
ఇక నిధుల విషయానికొస్తే, సోనియా గాంధీ నేతృత్వంలోని Rajiv Gandhi Foundation చైనా ప్రభుత్వం నుండి ఏకంగా మూడుసార్లు విరాళాలు తీసుకున్న విషయం బట్టబయలైంది. అంతేకాదు, ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ (PMNRF) నుంచి మన్మోహన్ సింగ్ హయాంలో నిధులను దారి మళ్లించి రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు అప్పజెప్పిన ఘనత కూడా సోనియా గాంధీకే దక్కుతుంది. ఇలాంటి చరిత్ర పెట్టుకుని, పీఎం కేర్స్ మీద విమర్శలు చేయడం ఎంత హాస్యాస్పదంగా ఉందో ప్రజలు గమనిస్తున్నారు.
లడఖ్ లేదా అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా తాజాగా మన భూభాగాన్ని ఆక్రమించిందనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని కేంద్ర ప్రభుత్వం, మిలిటరీ వర్గాలు స్పష్టంగా చెప్పినా, కాంగ్రెస్ మరియు వారికి వంతపాడే లెఫ్టిస్ట్ మీడియా మాత్రం మోదీ ప్రభుత్వాన్ని ‘బలహీనంగా’ చూపించడానికి పనిగట్టుకుని ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి. వాస్తవాలు తెలుసుకోకుండా, దేశ భద్రతను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం కాంగ్రెస్‌కే చెల్లింది.
మొత్తానికి, పీఎం కేర్స్‌పై విమర్శలు చేస్తూ కేరళ కాంగ్రెస్ చేసిన ఈ ఆరోపణలు, వారి స్వంత కుంభకోణాలను, చైనాతో వారికి ఉన్న రహస్య సంబంధాలను కప్పిపుచ్చుకోవడానికి ఆడుతున్న మరో నాటకం మాత్రమే. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నైజాన్ని, వారి రెండు నాల్కల ధోరణిని ఎప్పుడో గుర్తించారు. ఎంత గోల చేసినా, మోదీ ప్రభుత్వం దేశ రక్షణ విషయంలో రాజీ పడదని, జాతీయ ప్రయోజనాలే సర్వోన్నతమని దేశానికి తెలుసు


