పీఎం సూర్య ఘర్ పథకంలో రూ.200 కోట్ల కుంభకోణం: ఎంపీ రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
తెలంగాణ రాష్ట్రంలో ‘పీఎం సూర్య ఘర్’ పథకం అమలులో సుమారు రూ.200 కోట్ల మేర భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో సోలార్ ప్యానెల్స్ ముసుగులో జరుగుతున్న ఈ అవకతవకలపై తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రఘునందన్ రావు ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర మంత్రి.. ఈ వ్యవహారంపై తప్పకుండా విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.
ఈ కుంభకోణం ఎలా జరిగిందనే దానిపై రఘునందన్ రావు పలు వివరాలు వెల్లడించారు. ఈ పథకం కింద 40 వేల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు అమర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. అయితే, ఒక్కో ఇంటిపై సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు ఒక సంస్థ రూ.1.36 లక్షలకు టెండర్ దక్కించుకోగా, ఆ సంస్థ నుంచి మరో కంపెనీ కేవలం రూ.86 వేలకే ఆ పనులు చేసేలా సబ్ కాంట్రాక్ట్ తీసుకుందని ఆరోపించారు. మధ్యలో మిగిలిన రూ.50 వేలు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. అలా 40 వేల ఇళ్లకు గానూ రూ.200 కోట్లను స్వాహా చేశారని వివరించారు.
కేంద్ర ప్రభుత్వ నిధులను, పథకాలను దారి మళ్లిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటోందని రఘునందన్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “డబ్బులు కేంద్రానివి.. సోకు కాంగ్రెస్ ది” అంటూ ఎద్దేవా చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు పేరుతో కేంద్ర సబ్సిడీ నిధులను రేవంత్ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఈ అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క విచారణ జరిపించాలని, అలాగే కొండారెడ్డిపల్లిలో సోలార్ ప్యానెల్స్ ఘనత కేంద్రానిదేనని సీఎం రేవంత్ ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.
‘కాంగ్రెస్ అంటేనే కరప్షన్’ అని విమర్శించిన ఆయన.. కేంద్రం నుంచి అన్నీ తీసుకుంటూ కేంద్రం ఏమీ చేయలేదని ముఖ్యమంత్రి విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తన వందల కోట్ల అప్పులను ఎలా తీరుస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులతో పనులు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన విమర్శించారు.


