ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్య కేసు: ఆప్ నేత తాహిర్ హుస్సేన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష
2020లో జరిగిన ఢిల్లీ అల్లర్ల సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి అంకిత్ శర్మను అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో ఆప్ నేత తాహిర్ హుస్సేన్‌తో పాటు మరో నలుగురికి ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ హత్య అత్యంత కిరాతకంగా జరిగిందని, ఇది అరుదైన కేసు అని న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నిందితులు అంకిత్ శర్మపై కత్తులు, రాడ్లు, రాళ్లతో దాడి చేసి ఏకంగా 54 సార్లు కత్తితో పొడిచారని, చంపిన తర్వాత కూడా మృతుడిపై కసి తీరక ఆ మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి మురుగు కాలువ (నాలా)లో పడేశారని కోర్టు విచారణలో వెల్లడైంది. అయితే, మూకదాడిలో భాగంగా ఈ ఘటన జరగడం, ఆ సమయంలో వ్యాప్తిలో ఉన్న తప్పుడు సమాచారం తదితర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని న్యాయమూర్తి మరణశిక్షకు బదులుగా వీరికి ఈ యావజ్జీవ శిక్షను ఖరారు చేశారు.

ఈ తీర్పుపై అటు నిందితుల పక్షం, ఇటు ఇతర నేతల నుంచి భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. తాహిర్ హుస్సేన్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. కింది కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేస్తామని, తమకు ఆలస్యంగానైనా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని స్పష్టం చేశారు. మరోవైపు ఈ తీర్పుపై కపిల్ మిశ్రా స్పందిస్తూ.. అంకిత్ శర్మకు న్యాయం దక్కే దిశగా ఇది కేవలం తొలి అడుగు మాత్రమేనని పేర్కొన్నారు. ఒక ఐబీ అధికారిని అంత పాశవికంగా హతమార్చిన ఈ నిందితులకు యావజ్జీవం సరిపోదని, వారికి ఉరిశిక్ష వేస్తేనే సరైన న్యాయం జరిగినట్లు అని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో హైకోర్టు వీరికి మరణశిక్ష విధిస్తుందని తాను ఆశిస్తున్నట్లు ఆయన తన స్పందనను తెలియజేశారు.


