సీజేపీ ఆందోళనల వెనుక దాయాది కుట్ర! మోదీ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని పాక్ ఇన్ఫ్లుయెన్సర్ల విషప్రచారం!
న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) ఆందోళనలను ఆసరాగా చేసుకుని పాకిస్థాన్‌కు చెందిన రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు భారత్‌పై భారీ ఎత్తున విషప్రచారానికి తెరతీశారు. నీట్ (NEET) పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ మొదలైన ఈ ఆందోళనలు అనూహ్యంగా హింసాత్మక రూపం దాల్చి, పోలీసులతో జరిగిన ఘర్షణల్లో దాదాపు వంద మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. దేశ రాజధానిలో చెలరేగిన ఈ అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోక తప్పలేదు. అయితే, విద్యార్థుల ఆవేదనను రాజకీయంగా వాడుకుంటూ నేపాల్, బంగ్లాదేశ్ తరహాలో అరాచక పరిస్థితులను సృష్టించి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్ర ఈ ఆందోళనల వెనుక ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న రాజకీయ డిమాండ్‌ను ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కేంద్రం ఇప్పటికే స్పష్టమైన చర్యలు తీసుకుందని, విద్యార్థుల ముసుగులో కొందరు తమ స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని చూస్తున్నారని స్పష్టం చేశాయి.

సరిగ్గా ఈ అస్థిర పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకునేందుకు దాయాది దేశం పాకిస్థాన్ తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. ఎప్పటికప్పుడు భారత్‌ను దెబ్బతీయాలని చూసే పాక్.. భారత విద్యార్థులకు మద్దతు ఇస్తున్నామనే నెపంతో సోషల్ మీడియాలో నకిలీ వార్తలను, అబద్ధాలను విపరీతంగా వ్యాప్తి చేస్తోంది. జాతీయ భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడని మోదీ ప్రభుత్వంపై, ముఖ్యంగా ‘ఆపరేషన్ సింధూర్’, ‘సింధు జలాల ఒప్పందం’ రద్దు లాంటి కఠిన నిర్ణయాలతో రగిలిపోతున్న పాకిస్థాన్.. భారత్‌లోని తాజా అల్లర్లను చూసి సంబరపడుతోంది. ఈ కుట్రపూరిత ప్రచారంలో పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ రాపర్ తల్హా అంజుమ్ లాంటి వారు కూడా చురుకుగా పాల్గొంటున్నారు. గతంలో కాశ్మీర్ విషయంలో భారత సైన్యంపై, అలాగే ప్రధాని మోదీపై అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అంజుమ్.. ఇప్పుడు విద్యార్థులకు అండగా నిలుస్తున్నట్లు నటిస్తూ భారత మీడియా, భద్రతా బలగాలపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. నిరసనకారులపై పోలీసు దౌర్జన్యం జరుగుతోందంటూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. కేవలం రాజకీయ స్వలాభం కోసం దేశంలో అశాంతిని రగిల్చి, అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లేలా చేయాలన్న పాకిస్థాన్ శక్తుల కుయుక్తులకు ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయని రాజకీయ, భద్రతా విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.


