సైఫ్ అలీఖాన్ ప్రశంసల వెనుక ఉన్న నిజం! ప్రధాని మోదీ రోజుకు మూడు గంటలే నిద్రపోతారా?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త అక్షరాలా నిజం. ఇటీవల దివంగత రాజ్ కపూర్ వందో జయంతి ఉత్సవాల సందర్భంగా కపూర్ కుటుంబ సభ్యులతో కలిసి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ సమావేశాలు ముగించుకుని వచ్చినప్పటికీ, ప్రధాని ఎంతో ఉత్సాహంగా, చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించారని సైఫ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. దేశాన్ని నడిపించేంతటి బరువైన బాధ్యతలు మోస్తూనే ప్రతి ఒక్కరితోనూ ఆయన ఎంతో సమయం గడిపారని, సైఫ్ తల్లిదండ్రుల గురించి కూడా అడిగి తెలుసుకున్నారని తెలిపారు. సినీ ప్రముఖులు రాజకీయ నాయకులపై బహిరంగంగా స్పందించేందుకు వెనకడుగు వేసే ఈ రోజుల్లో, ప్రధాని అంకితభావాన్ని కొనియాడుతూ సైఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఈ భేటీ సందర్భంగా ప్రధాని మోదీ రోజుకు కేవలం మూడు గంటలు మాత్రమే నిద్రపోతారన్న విషయాన్ని సైఫ్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రోజంతా తీరికలేని కార్యక్రమాలతో అలసిపోయి ఉంటారని భావించినప్పటికీ, ప్రధాని అత్యంత చురుగ్గా కనిపించడంతో “మీకు ఎంత సమయం విశ్రాంతి దొరుకుతుంది?” అని సైఫ్ నేరుగా అడగగా, దానికి మోదీ బదులిస్తూ “రాత్రి పూట సుమారు మూడు గంటలు మాత్రమే” అని సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా, సైఫ్ పిల్లలైన తైమూర్, జెహంగీర్లను ఎందుకు తీసుకురాలేదని అడిగిన ప్రధాని.. వారి కోసం ప్రత్యేకంగా ఒక పేపర్‌పై సంతకం చేసి ఇవ్వడం విశేషం. నిరంతరం దేశం కోసం శ్రమిస్తూ కూడా ఇంత సానుకూల దృక్పథంతో ఉండటం చూసి తాను ఆశ్చర్యపోయానని సైఫ్ అలీఖాన్ ప్రధాని పనితీరుపై బహిరంగంగానే ప్రశంసల వర్షం కురిపించారు


