గాన కోకిల మూగబోయింది.. ఎస్. జానకి కన్నుమూత
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం అలముకుంది. ‘నైటింగేల్ ఆఫ్ ది సౌత్’ గా పేరొందిన ప్రముఖ నేపథ్య గాయని శిష్ట్లా జానకి కన్నుమూశారు. తన మధురమైన గాత్రంతో ఆరు దశాబ్దాల పాటు కోట్లాది మంది సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసిన గాన కోకిల ఇక శాశ్వతంగా మూగబోయింది. సంగీత ప్రపంచంలో ఆమె ప్రయాణం, సాధించిన ఘనతలు అనితర సాధ్యం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న రామమూర్తి, సత్యవతి దంపతులకు జానకి జన్మించారు. చిన్నప్పటి నుంచే సంగీతం పట్ల అమితమైన ఆసక్తి కనబరిచిన ఆమె, నాదస్వరం విద్యాంసుడు పైడిస్వామి వద్ద ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత మద్రాసు వెళ్లి ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ శిష్యుడైన అబ్దుల్ రవూఫ్ వద్ద హిందుస్థానీ సంగీతంలో శిక్షణ పొందారు.
1957లో తమిళ చిత్రం ‘విధియిన్ విలయాట్టు’ ద్వారా తన 19వ ఏట సినీ నేపథ్య గాయనిగా జానకి ప్రస్థానం ప్రారంభమైంది. అదే ఏడాది వచ్చిన ‘ఎం.ఎల్.ఏ’ చిత్రంలో “నీ ఆశ అడియాస” అనే పాటతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు హిందీ, ఒడియా, బెంగాలీ, తదితర 17 భాషల్లో సుమారు 48 వేలకు పైగా పాటలు పాడి ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు. ఒక గాయని ఇన్ని వేల పాటలు, ఇన్ని భాషల్లో, విభిన్నమైన స్వరాలతో పాడటం ప్రపంచ సంగీత చరిత్రలోనే అత్యంత అరుదు. పసిపాప వాయిస్ నుంచి వృద్ధురాలి వరకు ఏ వయసు వారికైనా, ఏ ఎమోషన్ కైనా తన గొంతును అవలీలగా మార్చి పాడగలిగే అద్భుతమైన నైపుణ్యం ఆమె సొంతం.
ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి మొదలుకొని చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో అనేక సూపర్ హిట్ గీతాలకు ఆమె ప్రాణం పోశారు. ఇళయరాజా, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి కాంబినేషన్ దక్షిణాది సినీ సంగీతంలో ఒక సువర్ణ అధ్యాయం. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, గీతాంజలి లాంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో ఆమె పాడిన పాటలు ఎప్పటికీ నిలిచిపోతాయి.
ఆమె మధురమైన గాత్రానికి ఎన్నో పురస్కారాలు దాసోహమన్నాయి. ఉత్తమ నేపథ్య గాయనిగా నాలుగు సార్లు జాతీయ అవార్డులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 10 సార్లు నంది అవార్డులు, కేరళ నుంచి 14 సార్లు, తమిళనాడు నుంచి 7 సార్లు రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నారు. 2013లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించగా, ఆ అవార్డు తనకు చాలా ఆలస్యంగా వచ్చిందని, దక్షిణాది కళాకారులకు తగిన గుర్తింపు దక్కడం లేదని తెలుపుతూ సున్నితంగా తిరస్కరించి తన ఆత్మగౌరవాన్ని చాటుకున్నారు.
2016 అక్టోబర్లో మలయాళ చిత్రం ’10 కల్పనకళ్’ లో పాడిన ‘అమ్మ పూవినమ్’ పాటతో ఆమె తన ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీ సంగీత ప్రయాణానికి స్వస్తి పలికారు. ఎస్. జానకి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె పాడిన ప్రతి పాట, ప్రతి స్వరం అనంతకాలం పాటు శ్రోతల హృదయాల్లో మార్మోగుతూనే ఉంటాయి. భారతీయ సినీ సంగీత చరిత్ర ఉన్నంత కాలం ఎస్. జానకి పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది.


