హవాయి చెప్పుల వెనుక వంద కోట్ల విమానం! ఈడీ దర్యాప్తులో బట్టబయలైన టీఎంసీ ‘లగ్జరీ’ బాగోతం!
“సామాన్యురాలిని, హవాయి చెప్పులే నా ఐడెంటిటీ” అని వేదికలెక్కి గొంతు చించుకునే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసలు స్వరూపం ఈడీ దర్యాప్తులో బట్టబయలైంది. పేదల నాయకురాలిగా చెప్పుకునే తృణమూల్ కాంగ్రెస్ (TMC) వెనుక వందల కోట్ల ఆర్థిక సామ్రాజ్యం, లగ్జరీ జెట్ విమానాలు, వీఐపీ హెలికాప్టర్లు ఉన్నాయన్న వాస్తవం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జులై 8, 2026న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విడుదల చేసిన పత్రికా ప్రకటన బెంగాల్ రాజకీయాల్లో పెద్ద బాంబు పేల్చింది. సామాన్యుడి కష్టార్జితమైన వందల కోట్ల రూపాయలు పార్టీ ఖాతాల్లో ఎలా పోగుపడ్డాయి అన్న దానిపై ఈడీ అధికారులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా టీఎంసీకి చెందిన మూడు హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి, అందులో ఉన్న ఏకంగా రూ. 440.42 కోట్లను స్తంభింపజేశారు.
అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. పార్టీ ఫండ్స్ పేరుతో ఉన్న నిధుల్లోంచి సుమారు రూ. 160 కోట్లను ‘కేర్ వెల్ ఏవియేషన్’ (Care Well Aviation) అనే సంస్థకు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నిధులతోనే కోటీశ్వరులు మాత్రమే వినియోగించే ఫ్లాట్ బెడ్ సీట్లున్న బ్రెజిలియన్ లగ్జరీ జెట్ ‘ఎంబ్రాయర్ లెగసీ 600’ (Embraer Legacy 600) తో పాటు, ‘అగస్టా 109 ఎస్పీ’ (Agusta 109 SP) అనే ఇటాలియన్ డబుల్ ఇంజిన్ వీఐపీ హెలికాప్టర్‌ను కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. వీటి విలువే సుమారు రూ. 112 కోట్లు ఉంటుందని అంచనా. ఈ కుంభకోణంలో మరో విస్తుపోయే అంశం కేమన్ ఐలాండ్స్ కనెక్షన్. పన్ను ఎగవేతదారులకు స్వర్గధామంగా భావించే ఆ దేశం నుంచి 2023లో హెలికాప్టర్ కొనుగోలు కోసం సుమారు 1.7 మిలియన్ డాలర్లు (దాదాపు 16 కోట్ల రూపాయలు) అన్సెక్యూర్డ్ లోన్ రూపంలో విదేశీ నిధులు వచ్చాయి. ఆ అజ్ఞాత దాత ఎవరు, ఎందుకు ఇచ్చారు అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.
ఈ మొత్తం వ్యవహారంలో పక్కాగా స్కెచ్ వేసిన దారిమళ్లింపు కుట్ర దాగి ఉంది. ముందుగా పార్టీ అకౌంట్ నుంచి కేర్ వెల్ సంస్థకు డబ్బు బదిలీ చేయడం, వారు ఆ డబ్బుతో జెట్, హెలికాప్టర్ కొనుగోలు చేయడం, ఆ తర్వాత వాటినే మళ్లీ పార్టీకే అద్దెకు ఇవ్వడం! అంటే సొంత డబ్బులతో విమానం కొని, దానికి సొంత డబ్బులనే అద్దెగా చెల్లిస్తూ, ‘ఎయిర్‌క్రాఫ్ట్ యూసేజ్’ పేరుతో కోట్లాది రూపాయలను బినామీలకు చేరవేసిన ఈ వినూత్న బెంగాల్ మోడల్ చూసి దర్యాప్తు సంస్థలే విస్తుపోతున్నాయి. హవాయి చెప్పులు వేసుకుని వేదికల మీద నీతులు చెప్పే నాయకురాలి వెనుక ఆకాశంలో ఎగురుతున్న 112 కోట్ల విమానం గుట్టు ఏమిటి, విదేశీ నిధుల వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు, ఈడీ విచారణ మొదలైనప్పుడు బెంగాల్ ప్రభుత్వం ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేసింది లాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాల్సి ఉంది. దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న వేళ, మున్ముందు ఇంకెన్ని నల్లధనం చీకటి కోణాలు వెలుగుచూస్తాయో అని యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోంది.


