దేవుళ్లు ఎందుకు మన భారతదేశంలోనే జన్మిస్తారు? పాశ్చాత్య మాయలో పడిన వారికి మన పురాణాలు ఇస్తున్న చెంపపెట్టు లాంటి సమాధానం!
“అసలు దేవుళ్లు అందరూ భారతదేశంలోనే ఎందుకు పుడతారు?” – సనాతన ధర్మాన్ని, మన విశ్వాసాలను కించపరచాలని చూసే కొందరు మేధావులు, పాశ్చాత్య భావజాలంతో ప్రభావితమైన యువత తరచుగా అడిగే వ్యంగ్యమైన ప్రశ్న ఇది. “హాలీవుడ్ సినిమాల్లో ఏలియన్స్ అంతా అమెరికా మీదే దాడి చేసినట్లు, భూమండలం అంతటినీ సృష్టించిన దేవుడికి అమెరికా, చైనా, ఐరోపా దేశాలు కనిపించలేదా? కేవలం ఇండియాలోనే ఎందుకు అవతారాలు ఎత్తాడు?” అని వారు ప్రశ్నిస్తుంటారు.
దీనికి సమాధానంగా మనలో చాలామంది “భారతదేశం పుణ్యభూమి కాబట్టి” అనో, లేదా “ఇక్కడ గొప్ప గొప్ప ఋషులు, గురుకుల వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి” అనో సర్దిచెప్పుకుంటారు. కానీ ప్రతి నాగరికతా తమ భూమిని పవిత్రమైనదిగానే భావిస్తుంది కదా? క్రైస్తవులకు జెరూసలెం, ముస్లింలకు మక్కా పవిత్రమైనట్లే, మనకు భారతదేశం పవిత్రం అని సరిపెట్టుకుంటే అందులో పూర్తి వాస్తవం లేదు. అయితే, ఈ ప్రశ్నకు మన పురాణాలలో స్పష్టమైన, శాస్త్రీయమైన సమాధానం ఉంది. దశాబ్దాలుగా మన విద్యావ్యవస్థ ద్వారా ఈ నిజాలను మనకు దూరం చేశారు. అసలు మన గ్రంథాలు ఏం చెబుతున్నాయో తెలిస్తే, ప్రతి భారతీయుడి రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది.
తొమ్మిది లోకాలు – ఎనిమిది భోగ భూములు మన పురాణాల ప్రకారం పరమాత్మ ఈ సృష్టిలో కేవలం ఒక ప్రపంచాన్ని మాత్రమే నిర్మించలేదు, తొమ్మిది లోకాలను సృష్టించాడు. వీటిలో ఎనిమిది లోకాలు అద్భుతమైన స్వర్గధామాలు (ప్యారడైజ్). అక్కడ ప్రజలు పదివేల సంవత్సరాలు జీవిస్తారు. వారికి ముసలితనం, రోగం, బాధ, మరణం అనేవే ఉండవు. అంతా సుఖమే. కానీ విచిత్రం ఏమిటంటే.. ఆ ఎనిమిది లోకాలలో ‘పాప పుణ్యాలు’ అనబడే కర్మ సిద్ధాంతం పనిచేయదు. అక్కడ మంచి, చెడు అనేవి ఉండవు. వారు ఎన్ని వేల ఏళ్లు బతికినా వారు చేసే ఏ పనికీ అర్థం ఉండదు. కష్టపడకుండా, సాధించకుండా ఉచితంగా వచ్చిన ఏ సంపద అయినా, పతకం అయినా ఎలా శూన్యంగా అనిపిస్తుందో.. ఆ ఎనిమిది లోకాలలో జీవితం కూడా కేవలం అనుభవించడానికి మాత్రమే పరిమితం, అక్కడ ఆత్మ ఉద్ధరణకు అవకాశం లేదు.
కర్మభూమి.. మన భరతఖండం ఆ తొమ్మిది లోకాలలో ఎనిమిది భోగభూములు కాగా, కర్మ సిద్ధాంతం పనిచేసే ఏకైక భూభాగం తొమ్మిదోది. అదే మన ‘భారతవర్షం’. పురాణాలు దీని గురించి చాలా భౌగోళిక స్పష్టతను ఇచ్చాయి. హిమాలయాలకు దక్షిణంగా, సముద్రాల చేత చుట్టుముట్టబడి ఉన్న భూభాగమే ఈ భారతవర్షం. అంటే ఈ కర్మభూమి ఐరోపానో, చైనానో, అమెరికానో కాదు.. కచ్చితంగా మన భారతదేశమే!
ఇక్కడ జీవితం పూలపాన్పు కాదు. ఇక్కడ కష్టాలు ఉంటాయి, వైఫల్యాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం చేసే ప్రతి పనికీ ఒక ఫలితం ఉంటుంది. శాశ్వతమైన జనన మరణ చక్రం నుంచి విముక్తినిచ్చే ‘మోక్షాన్ని’ సాధించుకునే అవకాశం కేవలం ఈ భూమి మీద పుట్టిన వారికి మాత్రమే ఉంది.
దేవతలు సైతం అసూయపడే అదృష్టం మనది ఈ భూమి విశిష్టత ఎంతటిదంటే… ఆ ఎనిమిది లోకాలలో వేల ఏళ్లు ఎలాంటి కష్టాలు లేకుండా బతుకుతున్న దేవతలు సైతం “మనం ఆ భారతవర్షంలో ఎప్పుడు పుడతామా?” అని ఎదురుచూస్తుంటారని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. ఎందుకంటే, దేవతలకైనా తమ పుణ్యం తీరిపోయాక మళ్లీ జన్మలెత్తక తప్పదు. కానీ ఈ కర్మభూమిలో పుట్టిన ఒక సాధారణ మానవుడు, కేవలం 70-80 ఏళ్ల జీవితకాలంలో నిస్వార్థ భక్తితో పరమాత్మను ఆరాధించి శాశ్వత మోక్షాన్ని పొందగలడు. ఆ అవకాశం దేవతలకు కూడా లేదు.
అందుకే మన గ్రంథాలు ఒక హెచ్చరిక కూడా చేశాయి – “భారతవర్షంలో మానవుడిగా జన్మించి కూడా, మోక్షం కోసం ప్రయత్నించని వాడు, చేతిలో ఉన్న అమృతాన్ని పారబోసి విషాన్ని తాగిన మూర్ఖుడితో సమానం” అని.
మరి దేవుడు ఇక్కడే ఎందుకు అవతరిస్తాడు? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ “యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత… ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అని స్పష్టంగా చెప్పాడు. ధర్మానికి హాని కలిగినప్పుడు తాను అవతరిస్తానని మాట ఇచ్చాడు. ధర్మం ఎక్కడైతే వేళ్లూనుకుని ఉంటుందో, అక్కడే కదా దానికి ముప్పు వాటిల్లేది? వేదాలు, గురుకుల వ్యవస్థ, ఆలయ సంప్రదాయాలు, గురు శిష్య పరంపర… ఇవన్నీ ఈ భూమిపైనే స్థాపించబడ్డాయి. పాశ్చాత్య దేశాలలో వారికి వారి సంస్కృతులు ఉండొచ్చు కానీ, మోక్షానికి దారిచూపే ధార్మిక వ్యవస్థ పునాదులు ఉన్నది కేవలం భరతభూమి పైనే. అందుకే ఈ ధర్మానికి ముప్పు వాటిల్లినప్పుడు దానిని రక్షించడానికి దేవుడు ఇక్కడే అవతరిస్తాడు.
ఆయన తలచుకుంటే ఎక్కడినుంచో కూర్చుని రాక్షసులను అంతం చేయగలడు. కానీ భగవంతుడికి తన భక్తులంటే ప్రాణం. ఇన్ని కష్టాల మధ్య కూడా ధర్మాన్ని నమ్ముకుని బతుకుతున్న తన భక్తులకు స్వయంగా కనిపించాలని, వారితో నడవాలని, వారి ప్రేమను అందుకోవాలని ఆ పరమాత్మ స్వయంగా మనిషి రూపంలో ఈ గడ్డ మీదకు దిగివస్తాడు. మన దేశంలో అణువణువునా కొలువై ఉన్న ప్రతి ఆలయంలోని మూర్తి, భగవంతుడికి మన మీద ఉన్న ఆ ప్రేమకే నిదర్శనం.
కాబట్టి, ఇన్నేళ్ల పాటు వలసవాద ఆలోచనలతో మన బ్రెయిన్ వాష్ చేసిన నకిలీ మేధావుల మాటలు పక్కనపెట్టి, మన గ్రంథాలు చెబుతున్న ఈ అద్భుతమైన సత్యాన్ని ప్రతి ఒక్కరూ గర్వంగా పదిమందికీ చెప్పాలి. భారతదేశం కేవలం ఒక భౌగోళిక భూభాగం కాదు, అది మోక్షానికి ఏకైక మార్గం!

I am Sirisha N, an independent journalist and proud right-winger. With a Post Graduation from the AP College of Journalism, I bring professional rigor to grassroots reporting. My focus is on cutting through the noise to deliver the unapologetic truth and hold the establishment accountable.
