1993 కోల్‌కతా బ్లాస్ట్! ‘మాస్టర్ మైండ్’ విడుదలకు సుప్రీం బ్రేక్

70 మందిని బలితీసుకున్న ‘మాస్టర్ మైండ్’కు బిగ్ షాక్.. 1993 నాటి కోల్‌కతా బ్లాస్ట్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

-జర్నలిస్ట్ శిరీష

1993లో దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన కోల్‌కతా (బౌబజార్) బాంబు పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. 70 మందికి పైగా అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఈ దారుణ మారణహోమంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న ప్రధాన ముద్దాయి ఎండీ. రషీద్ ఖాన్ ముందస్తు విడుదలను సర్వోన్నత న్యాయస్థానం నిలిపివేసింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన విడుదల ఉత్తర్వులపై స్టే విధించి, ఉగ్రవాద చర్యలకు పాల్పడే ‘మాస్టర్ మైండ్స్’ పట్ల చట్టం ఎంత కఠినంగా ఉంటుందో మరోసారి స్పష్టం చేసింది.

నెత్తురోడిన కోల్‌కతా – 1993 బౌబజార్ బ్లాస్ట్ ఫ్లాష్‌బ్యాక్

సరిగ్గా 31 ఏళ్ల క్రితం.. మార్చి 16, 1993 రాత్రి. కోల్‌కతాలోని బౌబజార్ ప్రాంతం ఒక్కసారిగా భారీ పేలుడుతో దద్దరిల్లింది. ఈ పేలుడు ధాటికి పలు భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. 70 మందికి పైగా అమాయకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. రషీద్ ఖాన్ పనిచేసే ప్రదేశంలో అక్రమంగా, భారీ ఎత్తున నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలే ఈ మారణహోమానికి కారణమని విచారణలో తేలింది.

ఈ దారుణ ఘటనపై సుదీర్ఘ విచారణ జరిపిన ప్రత్యేక TADA (ఉగ్రవాద, విధ్వంసక కార్యకలాపాల నిరోధక చట్టం) కోర్టు.. 2001లో రషీద్ ఖాన్ తో పాటు మరో నలుగురిని దోషులుగా నిర్ధారించింది. ఐపీసీ, ఆర్మ్స్ యాక్ట్, టాడా చట్టాల కింద జీవిత ఖైదు విధించింది. ఆ తర్వాత ఈ శిక్షను కలకత్తా హైకోర్టు, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా సమర్థించాయి.

ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు.. రంగంలోకి పశ్చిమ బెంగాల్ సర్కార్

జైలులో 33 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాడు, వయసు 77 ఏళ్లు పైబడింది, ఆరోగ్యం కూడా క్షీణించిందనే కారణాలను పరిగణనలోకి తీసుకుని (రిఫార్మేటివ్ థియరీ – సంస్కరణాత్మక సిద్ధాంతం ఆధారంగా) రషీద్ ఖాన్ ముందస్తు విడుదలకు జూన్ 5న ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. అయితే, ఇంతటి కరుడుగట్టిన నేరస్థుడిని వదిలిపెట్టడం సమాజానికి ప్రమాదకరం భావించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

సుప్రీంకోర్టులో తీవ్ర వాదనలు – ‘అతనే అసలు మాస్టర్ మైండ్’

కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) ఎస్.వి. రాజు వాదనలు వినిపిస్తూ కోర్టు దృష్టికి కీలక విషయాలు తీసుకొచ్చారు. 70 మందిని పొట్టనబెట్టుకుని, వందలాది మంది జీవితాలను నాశనం చేసిన దారుణమైన ఉగ్రదాడి తరహా కేసులో “రిఫార్మేటివ్ థియరీ” అమలు చేయడం ఏమాత్రం సరికాదని ఆయన కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర శిక్షా సమీక్షా మండలి (SSRB) కూడా ఇతని విడుదలను తీవ్రంగా వ్యతిరేకించిందని కోర్టుకు వివరించారు.

మరోవైపు రషీద్ ఖాన్ తరఫు సీనియర్ న్యాయవాది ఎం.ఆర్. శంషాద్ వాదిస్తూ.. “నా క్లయింట్ 33 ఏళ్లుగా జైలులో ఉన్నాడు, సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు. పైగా సహ నిందితుడైన పన్నాలాల్ జైస్వారాను 2014లోనే విడుదల చేశారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల దృష్ట్యా రషీద్ ను విడుదల చేయాలి” అని కోరారు.

దీనిపై సుప్రీం బెంచ్ ఘాటుగా స్పందించింది. “ఈ మారణహోమానికి అతనే మాస్టర్ మైండ్. అతనికి పడిన శిక్ష దాదాపు ఒక ఉగ్రవాద చర్యకు (Terrorist Act) సంబంధించినది” అని స్పష్టం చేసింది. “మేము ఇప్పుడు స్టే ఇవ్వకపోతే, ఈలోగా అతను జైలు నుంచి విడుదలైతే ఈ పిటిషన్ కు అర్థమే ఉండదు” అని తేల్చి చెబుతూ, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన విడుదల ఉత్తర్వులపై తక్షణం స్టే విధించింది.

అసలు ట్విస్ట్ ఏంటంటే..

వాస్తవానికి 2015లోనే రషీద్ ఖాన్ విడుదలకు అప్పటి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ అతనికి కేంద్ర చట్టాల (TADA) కింద శిక్ష పడినందున, సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అతన్ని సొంతంగా విడుదల చేసే అధికారం లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వానికి పెట్టుకున్న వినతి ఎటూ తేలకపోవడంతో, రషీద్ 2021లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి సుదీర్ఘ పోరాటం తర్వాత ఇటీవల అనుకూల ఉత్తర్వులు పొందాడు. కానీ, అంతలోనే సుప్రీంకోర్టు ఎంట్రీతో ఈ ‘మాస్టర్ మైండ్’ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *