అమరావతిలో ‘యోగాంధ్ర-2026’: ముఖ్య అతిథిగా బాబా రాందేవ్.. శరవేగంగా సన్నాహక ఏర్పాట్లు


అమరావతి :
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ నెల 21న అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న రాష్ట్ర స్థాయి ‘యోగాంధ్ర-2026’ కార్యక్రమానికి పతంజలి సంస్థ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ మంగళవారం వెల్లడించారు. ఈ మహోత్సవానికి బాబా రాందేవ్ ను స్వయంగా ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు యోగా అండ్ నేచురోపతి ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు, ఆయుష్ ఉన్నతాధికారుల బృందం త్వరలో హరిద్వార్ వెళ్లి ఆయనకు మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలకనుంది. కృష్ణా నదిపై ఉన్న విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు వేదికగా జరగనున్న ఈ మహా కార్యక్రమానికి సుమారు 25 వేల మంది యోగా సాధకులు హాజరుకానున్నారు. ఇంతటి భారీ సమూహాన్ని ప్రత్యేక గ్రూపులుగా విభజించి, రాందేవ్ బృంద సభ్యులతో పాటు వివిధ యోగా అసోసియేషన్ల ప్రతినిధుల పర్యవేక్షణలో ఆసనాలు వేయించనున్నారు. అలాగే, రాందేవ్ వద్ద ప్రత్యేక శిక్షణ పొందిన విద్యార్థులు కూడా ఈ వేదికపై పలు విశిష్ట ఆసనాలను ప్రదర్శిస్తారని, ఆయన రాకతో ‘యోగాంధ్ర’కు జాతీయ స్థాయిలో మరింత ప్రాచుర్యం దక్కుతుందని మంత్రి సత్యకుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు, ఈ కార్యక్రమ సన్నాహక ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు బాబా రాందేవ్ ప్రతినిధుల బృందం ఇప్పటికే విజయవాడ చేరుకుంది. మంగళగిరిలోని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, కమిషనర్ జి.వీరపాండియన్, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ తదితరులు ‘యోగాంధ్ర-2026’ ప్రణాళికలను, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఏర్పాట్లను వారికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి, సన్నాహాలు అత్యంత స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని రాందేవ్ బృందం ప్రశంసించింది.

సువిశాలమైన జాతీయ రహదారిపై ఈ మహా యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. బ్రిడ్జి సామర్థ్యం అంచనా వేయడంతో పాటు, ట్రాఫిక్ మళ్లింపు, వాహనాల రాకపోకల క్రమబద్ధీకరణపై ఇరు విభాగాల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. వేలాది మందికి స్పష్టంగా కనిపించేలా హై-కెపాసిటీ ఆడియో, వీడియో స్క్రీన్ల ఏర్పాటుతో పాటు మీడియా ప్రతినిధుల కవరేజీకి అనువుగా ప్రత్యేక మీడియా స్టేషన్లు, పటిష్టమైన బారికేడింగ్ తదితర ఏర్పాట్లను జాతీయ రహదారిపై అధికారులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *