-జర్నలిస్ట్ శిరీష
కాల్చుకుతినే రాజకీయాలకు హద్దులు ఉండవా? దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న జవాన్ల వీరత్వాన్ని సైతం తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకునే స్థాయికి దిగజారిపోయారా? ‘ఆపరేషన్ సింధూర్’ దెబ్బకు దాయాది దేశపు ఉగ్రవాదుల వెన్ను వణుకుతుంటే, ఇక్కడ మన దేశంలో కూర్చున్న ప్రతిపక్షాలకు, కాంగ్రెస్ ఎకోసిస్టమ్‌కు మాత్రం ఎందుకు కడుపుమండిపోతోంది? ఉగ్రవాదుల ఏరివేత కోసం భారత సైన్యం సాహసోపేతంగా చేసిన ఈ ఆపరేషన్‌పై బురదజల్లడమే లక్ష్యంగా ఒక వికృతమైన ఫేక్ న్యూస్ ఆపరేషన్‌కు తెరలేపారు. అబద్ధాలను నిజాలుగా భ్రమింపజేస్తూ వాళ్లు ఆడుతున్న నాటకాలు చూస్తే ప్రతి సగటు భారతీయుడి రక్తం ఉడికిపోవాల్సిందే!
అబద్ధాల కర్మాగారం – అమరుల పేరుతో దిగజారుడు రాజకీయం! “మోదీ ప్రభుత్వం గత ఏడాది కాలంగా అమరులను గుర్తించడం లేదు” అంటూ ఒక పచ్చి అబద్ధాన్ని ఏమాత్రం సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వదిలారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలను రాజకీయ బురద చల్లేందుకు వాడుకోవడం కంటే దారుణం ఇంకొకటి ఉంటుందా? అసలు వాస్తవాలను వక్రీకరించి, అమరవీరుల కుటుంబాల మనోభావాలతో ఆడుకునే ఈ కుటిల ప్రయత్నాన్ని చూస్తే ఎవరికైనా రక్తం మరగక మానదు.
అయితే, ఈ అబద్ధపు ప్రచారాన్ని పీఐబీ (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్, ప్రభుత్వ వర్గాలు పక్కా ఆధారాలతో బట్టబయలు చేశాయి. దేశం కోసం నెత్తురు చిందించిన వీరులకు దక్కాల్సిన పూర్తి గౌరవం, వారి కుటుంబాలకు అందాల్సిన సహకారం యథావిధిగా అందుతోందని ఆధారాలతో సహా నిరూపించాయి. అయినా సరే, ఈ ఫేక్ న్యూస్ ముఠా తమ విష ప్రచారాన్ని ఆపలేదు.
శత్రువులకు వత్తాసు పలుకుతున్నారా? ఆపరేషన్ సింధూర్ గురించి ప్రతిపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలు వింటుంటే.. వీరు మన సైన్యం పక్షాన ఉన్నారా లేక పాకిస్థాన్ పక్షాన మాట్లాడుతున్నారా అనే అనుమానం రాక మానదు. “ఉగ్రవాదులు ఎక్కడికి మాయమయ్యారు?” అని సాక్షాత్తూ పార్లమెంటులోనే ప్రశ్నించడం, “దాడికి ముందే పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చారు” అంటూ ఆర్మీ ఉన్నతాధికారుల (DGMO) ప్రకటనలనే వక్రీకరించడం వీరికే చెల్లింది.
పాకిస్థాన్‌కు దెబ్బ తగిలితే ఇక్కడ వీరికి ఎందుకు ఏడుపు? సైన్యం ఒక ఆపరేషన్ చేస్తే దానికి ఆధారాలు అడగడం ఏంటి? రాజకీయంగా మోదీని ఎదుర్కోలేక, ఏకంగా భారత సైన్యం ప్రతిష్టను, జాతీయ భద్రతను పణంగా పెట్టడం క్షమించరాని నేరం.
జాతి మిమ్మల్ని క్షమించదు! సైన్యం ఆపరేషన్ చేస్తే ఆధారాలు అడుగుతారు.. శత్రువులకు దెబ్బ పడితే కన్నీరు కారుస్తారు.. చివరకు దేశం కోసం ప్రాణాలిచ్చిన అమరుల పేర్లతో ఫేక్ న్యూస్ సృష్టించి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తారు. ఇది కేవలం రాజకీయం కాదు, జాతీయ భద్రతతో చెలగాటమాడటం!
రాజకీయ అధికార దాహం కోసం మీరు ఎంతకైనా దిగజారొచ్చు. కానీ దేశ భద్రతను, సైనికుల త్యాగాలను కించపరిస్తే మాత్రం ఈ దేశ ప్రజలు మౌనంగా చూస్తూ ఊరుకోరు. మీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు ఎన్ని వేల అబద్ధాలు పుట్టించినా, జాతీయవాదం ముందు అవి బూడిద కాక తప్పదు. భారత సైన్యంపై, అమరవీరుల త్యాగాలపై బురదజల్లాలని చూసే ప్రతి ఒక్కరికీ ఈ దేశ ప్రజలే తగిన బుద్ధి చెబుతారు!

I am Sirisha N, an independent journalist and proud right-winger. With a Post Graduation from the AP College of Journalism, I bring professional rigor to grassroots reporting. My focus is on cutting through the noise to deliver the unapologetic truth and hold the establishment accountable.
