హైదరాబాద్ లో తోకముడిచి.. ఖమ్మంలో ప్రతాపం చూపిస్తున్నారా? అనుమతులిచ్చిన అధికారుల అరెస్టు ఏదీ?
హైదరాబాద్ నడిబొడ్డున మూసీ సుందరీకరణ, గాంధీ విగ్రహ ఏర్పాటు పేరుతో పేదల ఇళ్లను కూల్చేందుకు వెళ్లిన ప్రభుత్వానికి ప్రజాగ్రహం ఏంటో రుచి తెలిసింది. మీడియా ఫోకస్, స్థానికుల భీకర తిరుగుబాటుతో వెనక్కి తగ్గిన సర్కార్.. ఇప్పుడు కొత్త నాటకానికి తెరతీసిందా? రాబోయే జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల్లో ఈ వ్యవహారం తమ ఓటు బ్యాంకుకు గండికొడుతుందన్న భయంతో ‘డ్యామేజ్ కంట్రోల్’ ప్లాన్ గీసిందా? అసలు ఎజెండాను పక్కదారి పట్టించడానికి వేసిన స్కెచ్ లో.. ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల ప్రాంత పేదలు బలైపోయారా?అది డైవర్షనా? లేక నిజంగానే ఉల్లంఘనా? నిన్నటి దాకా హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతాల్లో హడావిడి చేసిన యంత్రాంగం.. ఉన్నట్టుండి ఖమ్మంలోని వెలుగుమట్లపై ఎందుకు పడ్డారు? అక్కడ పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? మూసీ వద్ద ఎదురైన పరాభవాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మీడియా అటెన్షన్ ను డైవర్ట్ చేయడానికే గత మూడు రోజుల నుంచి కూల్చివేతలకు తెరతీశారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల డ్యామేజ్ కవర్ చేసుకోవడానికి ఖమ్మం పేదలను పావులుగా వాడుకోవడం ఎంతవరకు సమంజసం?
అసలు దొంగలు ఎక్కడ? అధికారుల అరెస్టులు ఏవీ?
ఇక్కడ ప్రభుత్వం, అధికారులు సమాధానం చెప్పాల్సిన అతిపెద్ద ప్రశ్న ఒకటి ఉంది. నిజంగా వెలుగుమట్లలో జరిగింది ఉల్లంఘనే అయితే..
అసలు ఆ ఇళ్లు కట్టడానికి పర్మిషన్లు ఇచ్చిన అధికారులు ఎవరు?
స్థలాలు రిజిస్ట్రేషన్లు చేసిన రెవెన్యూ బాబులు ఏమయ్యారు?
తప్పు జరిగినప్పుడు.. ఆ తప్పుకు కారణమైన అధికారులను ఎందుకు ఇప్పటిదాకా సస్పెండ్ చేయలేదు? వారిని కటకటాల వెనక్కి ఎందుకు నెట్టలేదు? కేవలం సామాన్యుడి గూడును మాత్రమే కూల్చే దమ్మున్న యంత్రాంగానికి.. ఆ గూడు కట్టడానికి లంచాలు మింగి అనుమతులిచ్చిన ఆఫీసర్ల మెడలు వంచే ధైర్యం లేదా? పేదల ఇళ్లే టార్గెట్ కావాలా?
ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే డైవర్షన్ పాలిటిక్స్ అని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. ఓట్లు వేసేటప్పుడు పేదలు కావాలి, కానీ తమ తప్పులు కప్పుకోవడానికి మాత్రం అదే పేదల ఇళ్లు టార్గెట్ కావాలా? ఈ ‘బుల్డోజర్ల డైవర్షన్లు’ ఇక సాగవు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం ఎంతకాలం పారిపోతుంది? అధికార యంత్రాంగం దీనికి జవాబుదారీ వహించే తీరాలి!
డైవర్షన్ పాలిటిక్స్: మూసీ సెగను చల్లార్చేందుకు ఖమ్మంలో పేదల ఇళ్లపై జూలు విదిల్చారా?