ఖమ్మంలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణం
ఖమ్మం: ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య (Vanajeevi Ramaiah) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య గారు శుక్రవారం ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు సుమారు 75 సంవత్సరాలు.

వనజీవి రామయ్య గారు ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందినవారు. ప్రకృతి పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసుకున్న ఆయన ఇప్పటివరకు ఒక కోట్లకు పైగా మొక్కలు నాటారు. ప్రకృతి అభిమానం పరాకాష్టకు చేరిన ఆయన, తన కుటుంబపు పేరు కూడా మార్చుకొని “వనజీవి”గా నిలిచారు.

2017లో భారత ప్రభుత్వం ఆయన సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
వనజీవి రామయ్య గారి జీవనదైర్యానికి అనుగుణంగా, ఆయన మనుమల పేర్లకూడా వృక్షాల పేర్లనే పెట్టారు. వారిలో కొందరి పేర్లు చందనపుష్ప, హరితలావణ్య, కబంధపుష్ప కాగా, మరొక మనుమతికి వనశ్రీ అని పేరు పెట్టడం విశేషం.
పర్యావరణవేత్తలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వనాలను సంరక్షించేందుకు ఆయన చేసిన సేవలు పాతికేళ్ళుగా భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తాయని అంటున్నారు.