కేంద్రం డెడ్‌లైన్.. అడవిలో హై అలర్ట్.. ఇక “ఖేల్ ఖతమ్”
- చివరి శ్వాసలో ఎరుపు రక్కసి: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
- నక్సల్స్ చేతిలో మిగిలింది కేవలం 40 రోజులే
- బస్తర్, అబూజ్‌మడ్‌లో ‘ఆల్-అవుట్’ ఆపరేషన్
న్యూస్ డెస్క్ – న్యూఢిల్లీ: ఇది కేవలం హెచ్చరిక కాదు.. ఇది అంతిమ పోరాటానికి శంఖారావం! దశాబ్దాలుగా దేశ అంతర్గత భద్రతకు సవాలుగా మారిన నక్సలిజం శవపేటికకు చివరి మేకు కొట్టే సమయం ఆసన్నమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న ఢిల్లీ వేదికగా నక్సల్స్‌కు స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు. “మాటలు లేవు.. చర్చలు లేవు.. ఇక మిగిలింది యాక్షన్ మాత్రమే” అనే సంకేతాలిస్తూ, మార్చి 31, 2026 నాటికి దేశాన్ని ‘నక్సల్ రహిత భారత్’గా మారుస్తామని ప్రకటించారు.
వెన్నులో వణుకు పుట్టిస్తున్న వ్యూహం: “నక్సలిజం తన చివరి శ్వాస తీసుకుంటోంది…” అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అడవిలో దాక్కున్న మావోయిస్ట్ అగ్రనాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. మార్చి 31 డెడ్‌లైన్ విధించారంటే, కేంద్రం ప్లాన్ ఎంత పక్కాగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నక్సల్స్ ఏరివేతకు కేంద్రం సిద్ధం చేసిన బ్లూప్రింట్ చూస్తుంటే, రాబోయే ఆరు వారాల్లో అడవిలో ఏం జరగబోతోందో ఊహించవచ్చు.
మిగిలింది 40 రోజులే.. తప్పించుకోవడం అసాధ్యం: నక్సల్స్ చేతిలో ఇప్పుడున్నది కేవలం 40 రోజులు (6 వారాలు) మాత్రమే. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, అబూజ్‌మడ్ వంటి దట్టమైన అడవుల్లో జవాన్ల బూట్ల చప్పుడు వినిపిస్తోంది. ఆకాశం నుండి డ్రోన్ కళ్లు డేగల్లా కాపలా కాస్తున్నాయి. ఎక్కడ దాక్కున్నా, పాతాళంలో ఉన్నా సరే లాక్కొచ్చి అంతం చేయడానికి కేంద్ర బలగాలు “ఆల్-అవుట్” ఆపరేషన్ మొదలుపెట్టాయి.
బుల్లెట్ కు బుల్లెట్ సమాధానం: “అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు.. అమాయక ఆదివాసీలను బలిగొంటే ఊరుకునేది లేదు.” తుపాకీ గొట్టం ద్వారా రాజ్యం తెస్తామనే భ్రమలో ఉన్నవారికి, భారత ప్రజాస్వామ్య శక్తి ఏంటో చూపించే సమయం ఇదేనని విశ్లేషకులు అంటున్నారు. లొంగిపోతే జనజీవన స్రవంతి.. లేదంటే శవపేటిక.. కేంద్రం వైఖరి ఇంతే స్పష్టంగా ఉంది.
నవశకానికి నాంది: ఒకప్పుడు వందల జిల్లాల్లో విస్తరించిన నక్సలిజం, నేడు కేంద్రం దెబ్బకు కొన్ని పాకెట్లకే పరిమితమై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆ ఆఖరి ఆనవాళ్లను కూడా తుడిచిపెట్టడానికి కేంద్రం సిద్ధమైంది. మార్చి 31, 2026 తర్వాత దేశంలో “నక్సలిజం” అనే పదానికి చోటు ఉండకూడదు.. ఉండదు కూడా! ఇది 140 కోట్ల భారతీయుల ఆకాంక్ష.