హైదరాబాద్: ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ఉద్యమ నేత శిబూ సోరెన్ మృతి పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
శిబూ సోరెన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన కేసీఆర్, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేశ రాజకీయాల్లో శిబూ సోరెన్ పోషించిన పాత్ర అపూర్వమని, పేదల హక్కుల కోసం ఆయన సాగించిన పోరాటం ఎన్నో తరాలకు ఆదర్శమని కొనియాడారు.
ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు శిబూ సోరెన్ చేపట్టిన ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు. ఆయన మరణం జాతీయ సమాఖ్య వ్యవస్థకు తీరనిలోటుగా అభివర్ణించిన కేసీఆర్, శిబూ సోరెన్ మౌలిక హక్కుల పరిరక్షణ కోసం చేసిన పోరాటాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ మరవలేరని పేర్కొన్నారు.