రిజర్వేషన్ల ఆశచూపి ఇస్లాంలోకి లాగే ప్రయత్నాలకు చెంపపెట్టు – జర్నలిస్ట్ శిరీష
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, మైనారిటీ బుజ్జగింపుల కోసం తమిళనాడు ప్రభుత్వం వేసిన భారీ స్కెచ్‌ను మద్రాస్ హైకోర్టు తుత్తునియలు చేసింది. రిజర్వేషన్ల ఎరవేసి, అమాయక హిందువులను ఇస్లాం మతంలోకి మార్చేందుకు పన్నిన కుట్రకు న్యాయస్థానం బ్రేకులు వేసింది. హిందూ మతం నుండి ఇస్లాంలోకి మారితే ఎట్టి పరిస్థితుల్లోనూ కమ్యూనిటీ రిజర్వేషన్లు వర్తించవని, మతం మారిన వ్యక్తి కేవలం ‘ముస్లిం’ మాత్రమే అవుతాడు తప్ప, ముస్లింలలోని వెనుకబడిన తరగతి (BC-Muslim) హోదాను పొందలేడని మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

అసలు వివాదం ఎక్కడ మొదలైంది?
తూత్తుకుడి జిల్లాకు చెందిన పరమశివం అనే హిందూ యువకుడు 2015లో ఇస్లాం మతంలోకి మారి తన పేరును ‘సమీర్ అహ్మద్’గా మార్చుకున్నాడు. అయితే, తాను మతం మారినప్పటికీ తనకు రిజర్వేషన్ల ప్రయోజనాలు కావాలని, తనను ముస్లిం లెబ్బాయ్ (Muslim Lebbai – ముస్లింలలో ఒక వెనుకబడిన వర్గం) గా గుర్తించి సర్టిఫికెట్ ఇవ్వాలని కాయతార్ తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆ దరఖాస్తును రెవెన్యూ అధికారులు తిరస్కరించడంతో అతను నేరుగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు.
కోర్టులో తన వాదనను సమర్థించుకునేందుకు, తమిళనాడు ప్రభుత్వం మార్చి 3, 2024న జారీ చేసిన ఒక వివాదాస్పద ప్రభుత్వ ఉత్తర్వును (G.O.) సమీర్ అహ్మద్ అడ్డం పెట్టుకున్నాడు. హిందూ వెనుకబడిన తరగతులు (BC), అత్యంత వెనుకబడిన తరగతులు (MBC), డీనోటిఫైడ్ కమ్యూనిటీలు (DNC) లేదా షెడ్యూల్డ్ కులాల (SC) నుండి ఇస్లాంలోకి మారిన వారు, మతం మారిన తర్వాత కూడా BC-Muslim కింద రిజర్వేషన్లు పొందవచ్చని ఆ జీవోలో ప్రభుత్వం పేర్కొంది.
తమిళనాడు ప్రభుత్వ జీవోపై హైకోర్టు ఆగ్రహం
ఈ కేసును విచారించిన జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, జస్టిస్ పి.బి. బాలాజీలతో కూడిన ధర్మాసనం.. తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వుల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఆ జీవోను కొట్టివేస్తూ అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది:
- ఇస్లాంలో కులాలు లేవు: ఇస్లాం మతం కుల వ్యవస్థను అంగీకరించదు. అందరూ సమానమే అని చెప్పే మతంలోకి మారిన తర్వాత, మళ్లీ పాత కులం పేరు చెప్పుకుని రిజర్వేషన్లు ఎలా అడుగుతారు? అని కోర్టు ప్రశ్నించింది.
- పుట్టుకతోనే గుర్తింపు: రాజ్యాంగం ప్రకారం వెనుకబడిన తరగతులు లేదా షెడ్యూల్డ్ కులాల హోదా అనేది ‘పుట్టుక’ (Birth) ద్వారా వస్తుంది. కేవలం మతం మారడం వల్ల ఒక వ్యక్తి ఆటోమేటిక్‌గా ముస్లింలలోని వెనుకబడిన తరగతికి (ఉదాహరణకు లెబ్బాయ్) చెందలేడు.
- రిజర్వేషన్లు మత ఆధారితం కాదు: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4) మరియు 16(4) కేవలం సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తాయి. కేవలం ఒక మతానికి చెందినవారు అన్న ఏకైక కారణంతో రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం.
హిందూ వ్యతిరేక శక్తుల కుట్రలు బట్టబయలు
తాజా తీర్పుతో ‘ద్రావిడ మోడల్’ పేరుతో హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటి గుణపాఠం ఎదురైందని జాతీయవాదులు, హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
రిజర్వేషన్లు అనేవి శతాబ్దాలుగా సామాజిక వివక్షకు గురైన హిందూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లాంటి మహనీయులు కల్పించిన ఆయుధం. కానీ, ఆ రిజర్వేషన్లను ఒక “ఎర” లాగా చూపి, ఎస్సీ, బీసీ వర్గాల ప్రజలను ఇస్లాంలోకి మార్చడానికి ప్రభుత్వాలే స్వయంగా జీవోలు జారీ చేయడం దారుణమని విశ్లేషకులు మండిపడుతున్నారు. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కేవలం తమిళనాడుకే కాకుండా, ఓటు బ్యాంకు కోసం మతమార్పిడులను ప్రోత్సహిస్తున్న దేశవ్యాప్త రాజకీయ పార్టీలన్నింటికీ ఒక గట్టి హెచ్చరిక.

I am Sirisha N, an independent journalist and proud right-winger. With a Post Graduation from the AP College of Journalism, I bring professional rigor to grassroots reporting. My focus is on cutting through the noise to deliver the unapologetic truth and hold the establishment accountable.
